16, జనవరి 2017, సోమవారం

గుంటూరు క‌ళాప‌రిష‌త్ 21వ వార్షిక నాట‌కోత్స‌వాలు

గత 21 సంవత్సరాలుగా గుంటూరు కళాపరిషత్ తెలుగు నాటకరంగ వికాసానికి తగిన పాత్రపోషిస్తోంది. అందులో భాగంగా పలు ఫోటోలు, తగిన సమాచారాన్ని కూడా అందించాలని చేసిన చిన్న ప్రయత్నం ఇది.

గుంటూరు క‌ళాప‌రిష‌త్ 21వ వార్షిక నాట‌కోత్స‌వాలు 2017 జ‌న‌వ‌రి 11,12,13 తేదీల్లో గుంటూరులోని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విజ్ఞాన‌మందిరంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ప్రాంగ‌ణానికి శ్రామిక జ‌న‌నేత కీర్తిశేషులు కామ్రేడ్ జి.వి.కృష్ణారావు క‌ళాప్రాంగ‌ణ‌ముగా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా తొలిరోజున వేదిక‌కు ప్రముఖ నాట‌క‌, సినీ ర‌చ‌యిత‌ కీర్తిశేషులు గ‌ణేష్‌పాత్రో క‌ళావేదిక‌గానూ, రెండ‌వ‌రోజు వేదిక‌కు ప్ర‌ముఖ నాట‌క ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు కీర్తిశేషులు అందే న‌ర‌సింహారావు క‌ళావేదిక‌గానూ, చివ‌రిరోజైన మూడ‌వ రోజు ప్ర‌ముఖ ప్ర‌జాక‌వి, నాట‌క ర‌చ‌యిత కీర్తిశేషులు కాట్ర‌గ‌డ్డ హ‌నుమంత‌రావు క‌ళావేదిక అని నామ‌క‌ర‌ణం చేసి ఉత్స‌వాలు నిర్వ‌హించారు. ఈ వార్షికోత్స‌వానికి ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ మ‌రియు ఠాగూర్ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ వారు సౌజ‌న్యం అందించారు.

తొలిరోజు ప్రదర్శనలో భాగంగా 11.01.2017 న 6.05 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలన చేశారు.


అనంతరం 6.15 నిమిషాలకు శార్వాణి గిరిజన సాంస్కృతిక సంఘం, బొరివంక వారి ‘‘తేనెటీగ’’ సాంఘిక నాటిక ప్రదర్శితమైంది. దీనికి మూలకథ చింతకింది శ్రీనివాసరావు రచించగా కె.కె.ఎల్.స్వామి దర్శకత్వం వహించారు. ఈనాటికను కామ్రేడ్ కీ.శే. జి.శౌరి, శౌరమ్మల స్మృత్యర్థం కుమారుడు జి.శాంతకుమార్, మాజీ అధ్యక్షుడు, గుంటూరు బార్ అసోసియేషన్, మనుమడు అరుణ్ శౌరి సమర్పించారు. ‘‘తేనెటీగ’’ నాటిక తాలూకు ఫోటోలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.


అనంత‌రం రాత్రి7.15 నిమిషాల‌కు స‌భాకార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ స‌భ‌లో గుంటూరు క‌ళాప‌రిష‌త్ అధ్య‌క్షుడు వ‌ల్లూరి తాండ‌వ‌కృష్ణ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి డాక్ట‌ర్. జ‌స్టిస్ కె.జి.శంక‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. గుంటూరు బార్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షుడు, న్యాయ‌వాది చెరుకూరి స‌త్య‌నారాయ‌ణ అతిథిగా పాల్గొన్నారు. గుంటూరు క‌ళాప‌రిష‌త్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.పూర్ణ‌, కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అమ్మిశెట్టి శివ‌లు వ‌క్త‌లుగా ప్ర‌సంగించారు.
సభానంతరం వి.గోపాల‌కృష్ణ అతిథుల‌ను ఆహ్వానించారు.తొలిరోజు రెండవ నాటికగా సరిగ్గా 7.45 నిమిషాలకు శిరీష ఆర్ట్స్, విశాఖపట్నం వారిచే ‘‘ఓ రాజకీయ కథ’’ సాంఘిక నాటిక ప్రదర్శితమైంది. ఈ నాటికకు మూల కథ శ్రీమతి ఓల్గా అందించగా నాటకీకరణ, దర్శకత్వం దండు నాగేశ్వరరావు అందించారు. ఈ నాటికను జాలం ఎన్విరాన్మెంట్, హైదరాబాద్ వారు సమర్పించారు. ఈనాటిక ఫోటోలు క్రింద ఇవ్వబడ్డాయి.
అనంతరం 8.45 నిమిషాలకు సభాకార్యక్రమాన్ని నిర్వహించారు. సభానంతరం సరిగ్గా 9.00 గంటలకు ఉషోదయా కళానికేతన్, కట్రపాడు వారి ‘‘గోవు మా లచ్చిమి’’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఈ నాటికకు మూలకథ శ్రీమతి శీలా సుభద్రాదేవి  అందించగా నాటకీకరణ, దర్శకత్వం చెరుకూరి సాంబశివరావు వహించారు. ఈ నాటికను 75 తాళ్ళూరు , గుంటూరు జిల్లాకు చెందిన కళ్లం తిరుపతిరెడ్డి, నాగేంద్రమ్మ స్మృత్యర్థం కుమారుడు సుందరరామిరెడ్డి సమర్పించారు. ఈ నాటికకు సంబంధించిన ఫోటోలు కింద ఇవ్వటం జరిగింది.

గురువారం 12 జనవరి 2017 సాయంత్రం 6.05 నిమిషాలకు జ్యోతిప్రజ్వలన కార్యక్రమంతో రెండవ రోజు ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 6.15 నిమిషాలకు న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్, విజయవాడ వారి ‘‘పెద్దయ్యాక రైతునౌతా’’ బాలల నాటిక ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఎం.ఎస్.చౌదరి వహించగా కామ్రేడ్ ఆర్.వి.ఎల్. నరసింహారావు, సుబ్బలక్ష్మిల జ్ఞాప‌కార్థం కుమారుడు ఆర్‌.రాము, డైరెక్ట‌ర్‌, సెంట్ర‌ల్ ప‌బ్లిక్ స్కూల్‌, గుంటూరు వారు స‌మ‌ర్పించారు. ఈ నాటికకు సంబంధించిన ఫోటోలు ఈ క్రింద ఇవ్వటం జరిగింది.
అనంత‌రం రాత్రి7.15 నిమిషాల‌కు స‌భాకార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ స‌భ‌లో గుంటూరు క‌ళాప‌రిషత్ ఉపాధ్యక్షుడు నాయుడుగోపి అధ్య‌క్ష‌త వ‌హించ‌గా గుంటూరుకు చెందిన ప్ర‌ముఖ పిల్ల‌ల వైద్య‌నిపుణుడు డాక్ట‌ర్ కొండ‌బోలు కృష్ణ‌ప్ర‌సాద్ ఎం.డి., డి.సి.హెచ్‌. ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. రంగ‌స్థ‌ల ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు నుసుము నాగ‌భూష‌ణం అతిథిగా పాల్గొన్నారు. గుంటూరు క‌ళాప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి పుల‌గం సాంబిరెడ్డి, కార్య‌వ‌ర్గ స‌భ్యులు షేక్‌.సైదాలు వ‌క్త‌లుగా ప్ర‌సంగించారు. గుంటూరు క‌ళాప‌రిష‌త్ మ‌రో కార్య‌ద‌ర్శి కొల్లా వెంక‌ట కృష్ణారావు అతిథుల‌ను ఆహ్వానించారు.స‌భానంత‌రం చైత‌న్య క‌ళాస్ర‌వంతి, ఉక్కున‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం వారి ‘‘ నాన్నా.. నువ్వొక సున్నానా..’’ సాంఘికనాటిక ప్ర‌ద‌ర్శించారు. ఈ నాటిక‌కు మూలక‌థ పెనుమాక నాగేశ్వ‌ర‌రావు అందించ‌గా స్నిగ్ధ నాట‌కీక‌ర‌ణ చేశారు. పి.బాలాజీ నాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నాటికకు సంబంధించిన ఫోటోలు కింద ఇవ్వటం జరిగింది.

రెండవరోజు మూడవ నాటికగా సరిగ్గా 9.00గంటలకు మథు థియేటర్ ఆర్ట్స్, తుళ్ళూరు నాటకసమాజం వారిచే ‘‘నిశ్శబ్దసంకేతం’’ సాంఘిక నాటిక ప్రదర్శించారు. ఈ నాటికకు మూలకథ వారాల కృష్ణమూర్తి అందించగా నాటకీకరణ, దర్శకత్వం ఎం.మథు వహించారు. ఈ నాటికను గుంటూరుకు చెందిన ధనుష్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సి.ఇ.ఓ. అండ్ ఎం.డి. చక్రధర్ మాజేటి సమర్పించారు. ఈ నాటికకు సంబంధించిన ఫోటోలు కింద ఇవ్వటం జరిగింది.
ఆఖ‌రి రోజైన మూడ‌వ రోజు శుక్ర‌వారం 13 జ‌న‌వ‌రి 2017న సాయంత్రం 6.05 నిమిషాల‌కు జ్యోతిప్ర‌జ్వ‌ల‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అనంత‌రం స‌రిగ్గా 6.15 నిమిషాల‌కు సాగ‌రి, చిల‌క‌లూరిపేట వారి "న‌ల్లజ‌ర్ల‌రోడ్డు" సాంఘిక నాటికను ప్ర‌ద‌ర్శించారు. ఈ నాటిక‌కు మూల‌క‌థ‌ను కీర్తిశేషులు దేవ‌ర‌కొండ బాల‌గంగాధ‌ర తిల‌క్ అందించ‌గా, కందిమ‌ళ్ళ సాంబ‌శివ‌రావు నాట‌కీక‌ర‌ణ చేశారు. ఈ నాటిక‌కు ఐ.రాజ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ నాటిక‌ను కీర్తిశేషులు బండ్ల అంజ‌య్య‌, సీతారావ‌మ్మ‌ల స్మృత్య‌ర్థం వారి కుమారుడు హైద‌రాబాద్ ఎల్‌.ఐ.సి. సిటీ బ్రాంచి  -1 సీనియ‌ర్ బ్రాంచి మేనేజ‌ర్  నారాయ‌ణ‌రావు స‌మ‌ర్పించారు. ఈ నాటిక‌కు సంబంధించిన ఫోటోల‌ను కింద ఇవ్వ‌టం జ‌రిగింది.

అనంత‌రం స‌రిగ్గా 7.15 నిమిషాల‌కు జ‌రిగిన స‌భాకార్య‌క్ర‌మానికి  గుంటూరుక‌ళాప‌రిష‌త్ గౌర‌వాధ్య‌క్షులు ఆలోకం పెద్ద‌బ్బ‌య్య అధ్య‌క్ష‌త వ‌హించ‌గా విశిష్ట అతిధిగా కేంద్ర సంగీత నాట‌క అకాడ‌మీ అవార్డు గ్ర‌హీత, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌భాషా, సాంస్కృతిక‌శాఖ‌ సంచాల‌కులు డాక్ట‌ర్ డి.విజ‌య‌భాస్క‌ర్ విశిష్ఠ అతిధిగా పాల్గొన్నారు. ప్ర‌జాసాహితి సంపాద‌కుడు కొత్త‌ప‌ల్లి ర‌విబాబు ముఖ్య అతిథిగా పాల్గొనగా, విజ‌య‌వాడ సుమ‌ధుర క‌ళాప‌రిష‌త్ అధ్య‌క్షులు సామంత‌పూడి న‌ర‌స‌రాజు అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. గుంటూరుక‌ళాప‌రిష‌త్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి బి.పూర్ణ నివేదిక‌ను నివేదించారు.స‌భానంతరం స‌రిగ్గా 7.45 నిమిషాల‌కు గ‌ణేష్ ఆర్ట్ థియేట‌ర్స్‌, గుంటూరు వారిచే "అంతా మ‌న సంచికే" హాస్య‌నాటిక ప్ర‌ద‌ర్శించారు. ఈ నాటిక‌కు వ‌రికూటి శివ‌ప్ర‌సాద్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కీర్తిశేషులు బండ్ల సుబ్బారావు, ధ‌న‌రంగాబాయ‌మ్మ‌ల స్మృత్య‌ర్థం వారి కుమారుడు విజ‌య‌వాడ‌కు చెందిన న్యాయ‌వాది బండ్ల సాంబ‌శివ‌రావు స‌మ‌ర్పించారు. ఈ నాటిక‌కు సంబంధించిన ఫోటోలు కింద ఇవ్వ‌టం జ‌రిగింది.
చివ‌రిరోజైన మూడ‌వ రోజు చివ‌రి ప్ర‌ద‌ర్శ‌న‌గా రాత్రి 9.00 గంట‌ల‌కు గంగోత్రి, పెద‌కాకాని వారి "ద‌గ్ధ‌గీతం" సాంఘిక నాటిక‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ నాటిక‌కు పెద్దిభొట్ల సుబ్బ‌రామ‌య్య మూల‌క‌థ‌ను అందించ‌గా విద్యాధ‌ర్ మునిప‌ల్లె నాట‌కీక‌ర‌ణ చేశారు. నాయుడు గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ నాటిక‌కు జె.కె.సి.క‌ళాశాల మాజీప్రిన్సిప‌ల్‌ కె.వి.య‌న్‌.బి.కుమార్ జ్ఞాప‌కార్థం చేబ్రోలు కు చెందిన ఆయ‌న శిష్యుడు కోగంటి నాగేంద్ర స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ నాటిక‌కు సంబంధించిన ఫోటోలు కింద ఇవ్వ‌టం జ‌రిగింది.